Thursday, August 28, 2008

మనసున మల్లెల మాలలూగెనే

చిత్రం: మల్లీశ్వరి (1951)
సాహిత్యం: శ్రీ దేవులపల్లి వేంకటకృష్ణశాస్త్రి
సంగీతం: శ్రీ సాలూరు రాజేశ్వరరావు
నేపథ్యగానం: శ్రీమతి భానుమతీ రామకృష్ణ

మనసున మల్లెల మాలలూగెనే
కన్నుల వెన్నెల డోలలూగెనే
ఎంతహాయి యీ రేయి నిండెనో
ఎన్నినాళ్లకీ బతుకు పండెనో
కొమ్మల గువ్వలు గుసగుసమనినా
రెమ్మల గాలులు ఉసురుసురనినా
అలలు కొలనులో గలగలమనినా
దవ్వుల వేణువు సవ్వడి వినినా
నీవు వచ్చేవని నీ పిలుపే విని
కన్నుల నీరిడి కలయజూచితిని
గడియ యేని యిక విడిచిపోకుమా
ఎగసిన హృదయము పగులనీకుమా

Tuesday, August 12, 2008

అగ్ని స్ఖలన సందగ్ధ రిపువర్గ

చిత్రం: ఛత్రపతి (2005)
సాహిత్యం: శివశక్తిదత్తా
సంగీతం: మరకత మణి కీరవాణి
నేపథ్యగానం: మరకత మణి కీరవాణి, మంజరి, మాతంగి

అగ్ని-స్ఖలన-సందగ్ధ-రిపు-వర్గ ప్రళయ-రథ-ఛత్రపతి
మధ్యందిన-సముద్యత్‌-కిరణ-విద్యుద్ద్యుమణి-ఖని ఛత్రపతి
తఝ్ఝణుతఝణు-తద్ధింధిరన-ధీంధీంతకిట నట ఛత్రపతి
ఉర్వీ-వలయ-సంభావ్య-వర స్వచ్చంద-గుణధీ

కుంభీ-నిగర-కుంభస్త-గురు కుంభీ-వలయ-పతి ఛత్రపతి
ఝంఝా-పవన-గర్వాపహర-వింధ్యాద్రి-సమ-ద్యుతి ఛత్రపతి
చండ-ప్రబల-దోర్దండ-జిత-దోర్దండ-భట-పతి ఛత్రపతి
శత్రు-ప్రబల-విచ్చేదకర-భీమార్జున-ప్రతి

దిగ్దిగ్విజయ-ఢంకానినద-ఘంటారవ-పుషిత ఛత్రపతి
సంఘ-స్వజన-విద్రోహి-గణ-విద్వంస-మత-మతి ఛత్రపతి
ఆర్త-త్రాణ దృష్టద్యుమ్న-క్షాత్రస్పూర్తీ-ధీధితి ధీమత్‌-క్ష్మాపతి శిక్షాస్మృతీ-స్థపతి

అర్థం:
1. బయటకు వచ్చిన అగ్నివల్ల (అగ్నిస్ఖలన) కాల్చబడ్డ (సందగ్ధ) శత్రుసమూహము (రిపువర్గ) కలిగినవాడు. ప్రళయమనే కాల రథానికి అధిపతి ఛత్రపతి. అంటే ఒకరకంగా శివుడితో పోల్చడం!
2. బాగా ప్రకాశవంతమైన (సమ్ ఉద్యత్) మధ్యాహ్నపు (మధ్యం దిన) కిరణములతో అలరారే (విద్యుత్) సూర్యులకు (ద్యుమణి) నిలయం (ఖని). కోటి సూర్యులకు సమానమైన కాంతి కలిగిన అన్న అర్థంలో.
3. తఝ్ఝణుతఝణు-తద్ధింధిరన-ధీంధీంతకిట అనే జతులకు తగిన నాట్యమాడే నటధీరుడు. నటరాజుగా.
4. భూగోళంలోని (ఉర్వీ-భూమి, వలయ-గోళం) గౌరవించదగినవారిలో (సంభావ్య) గొప్పవాడు (వర). స్వేచ్ఛాయుతమైన (స్వచ్చంద) గుణములకు ఆలవాలం (గుణధీ).
5. శ్రేష్ఠమైన (నిగర) ఏనుగు (కుంభీ) కుంభస్థలం (కుంభ) పైనున్న (స్థ) గురు అనే పేరున్న పశువిశేషము. అలాగే, ఏనుగుల సమూహానికి (వలయ) నాయకుడు.
6. ఝంఝానిలం యొక్క గమనగర్వాన్ని అణచే వింధ్య పర్వతాలతో సమానమైన కాంతి (ద్యుతి) కలిగినవాడు. గర్వాపహారి.
7. భయంకరమైన (చండ) ప్రత్యేకమైన (ప్ర) బలవంతమైన చేతికర్రచే (దోర్దండ) జయింపబడిన (జిత) దండధారులైన భటులకు రాజు. అంటే శత్రువులను జయించగల దండధారులైన భటులకు రాజు.
8. ప్రత్యేక (ప్ర) బలాన్వితులైన శత్రువులను రూపుమాపడంలో (విచ్ఛేదకర) భీమార్జునులతో పోలిక (ప్రతి) కలవాడు.
9. అన్ని దిక్కులలో విజయభేరుల (విజయ ఢంకానినద, ఘంటారవ) మ్రోతలచే ఉప్పొంగేవాడు (పుషిత-పోషించబడే).
10. సంఘానికి, తనవారికి విశేషమైన ద్రోహం చేసే సమూహాలను ధ్వంసంచేయడమనే మతమునందు నిలచిన మనస్సుకలవాడు.
11. ఆర్తులకు రక్షకుడు. దృష్టద్యుమ్నుడి లాగానే క్షత్రియ పరాక్రమ కిరణాలు (దీధితి) ప్రసరింపజేయగలవాడు. ధీమంతులకీ భూమికీ (క్ష్మా) నాయకుడు. శిక్షాస్మృతిని అమలుపరిచే అధినాయకుడు (స్థ-ఉన్న).