Tuesday, May 12, 2009

దోస్తు బడా దోస్తు

నేను ఈ పాట సాహిత్యం ప్రత్యేకంగా పనిగట్టుకుని ఇలా లిఖించి ప్రచురించటానకి కారణం: ఇలా అనకూడదు కానీ, నాకు ఈ పాట ఒకరు వినిపించిన తర్వాత నాకు కలిగిన ఏవగింపు. అసలు తెలుగులో ఇంతకంటే మంచి సాహిత్యమే వ్రాయలేరా... ప్రాసకోసం పాకులాట తప్పితే పదాల పొందిక, అందమూ వ్రాసేవారికి ఎందుకు పట్టవు అన్న అనుమానం, బెంగ, బాధ. ఒక తమిళపాటకి అదే బాణీలో తెలుగులో పాట వ్రాయటం కష్టమే. కానీ, మరీ ఇలాగా? పాడేవాళ్ల సంగతి అటుంచితే బాణీ సమకూర్చిన ఇళైయరాజా-తనయుడికీ పాట వ్రాసిన వెన్నెలకంటివారికీ అస్సలు భాష విషయంలో కించిత్తైనా బాధ్యతగా వ్యవహరించాలన్న ఉచితానుచిత విచక్షణ ఉన్నట్టు అనిపించటం లేదు. మనసంతా కకావికలైపోయింది ఈ పాట విన్నతర్వాత. చెప్పదలచుకున్నది అదే బాణీకి ఇంకా అందంగా చెప్పవచ్చు అని నాకు బలంగా అనిపిస్తోంది. పరాయి భాషల్లోని పదాలు అరువు తెచ్చుకుని మరీ చెలామణీ చేయించడం తెలుగు వాళ్లకి మాత్రమే ఉన్న తెగులు అనుకున్నాను, దీని తమిళ మాతృక వినే వరకూ. హత విధీ.

దోస్తూ బడా దోస్తూ ... కట్టు ఇన్‌కమ్ శిస్తూ... ఉండు రోజూ పస్తూ... పడుతూ లేస్తూ... రామచంద్రప్రభో! ప్రాస లేకపోయినా పాటలు అందంగా వ్రాయవచ్చు అని ఈ వ్రాతగాళ్లకి ఎప్పటికి తెలిసివస్తుందో కదా! ఇంతే సంగతులు, చిత్తగించవలెను. కాదు కాదు, దీనికి ఇంకా తెలుగు ధారావాహికాల జీళ్లపాకంవంటి కొనసాగింపు ఉంది.

* * *

చిత్రం: సరోజ (2008)
వ్రాతగాడు: వెన్నెలకంటి రాజేశ్వరప్రసాద్
కూతగాళ్లు: హరిచరణ్, నవీన్, రాహుల్ నంబియార్
బాణీగాడు: యువన్ శంకర్ రాజా

దోస్తు బడా దోస్తు
దోస్తీ యమ ఫాస్టు
సౌతెండ్ నుండి నార్తు
మన జండా పాతు

నేస్తమా మనమప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ కింగ్సే
మనమంటే ఎవరూ ఒకరికి ఒకరైనా ఒలెంపిక్ రింగ్సే

విడదు మన స్నేహం
చూపించు మన వేగం
వినిపించు మన రాగం

కలలు గను యవ్వనం
కనుల నవనందనం
కలాం కలాం అబ్దుల్ కలాం అన్న మాటలకో సలాం
వయసు నది వెల్లువై వచ్చినా
మధ్యలో ఆటంకాలెన్నున్నా దాటేద్దాం
ఓజోనంటూ ఆకాశానికి చిల్లొకటుంది
స్నేహమను ఆకాశానికి చిల్లే లేదు ఎల్లే లేదు

చేరు నీ గమ్యము
చేరువౌ విజయము
పట్టిందల్లా బంగారమే
మన జాతకమే ఇది
నింగికిక నిచ్చెనేసుకో
చుక్కల తోటలో పువ్వులే కోసుకో
ఈ చిరుగాలి పల్లకిలోన వచ్చే పాట
ఇంక మనమాడిందాట పాడిందిపాట పదరా బేటా

* * *

యమాఫాస్టు ప్రయోగంలో యమ పదాన్ని ఏ భాషలో ఏ అర్థంలో అన్వయించుకోవాలో కదా. అసలు కొంతవరకూ ఇలాంటి ప్రయోగాలకి వేటూరివారు బాధ్యుడు. దోస్తు-ఫాస్టు-నార్తు-పాతు... ప్రాస!!! పోనీ ప్రాస ప్రక్కన పెడితే పోనీలే ఏదో బాగానే ఉంది అనుకున్నాను. ఎల్లలెరుగని స్నేహం గురించి చెప్పాడు అని.

తర్వాతి రెండు పంక్తులలో రెండవది ఏమిటో నాకు అర్థం కాలేదు. ఏం చెప్పదలచుకున్నాడు ఈ గేయరచయిత? అన్నట్టు ఈ పాట చూస్తే గుర్తొచ్చింది, ఈ మధ్య అవసరమున్నా లేకపోయినా ముఖ్యంగా బాణీ కోసం (నొక్కివక్కాణించటానికి వాడదగిన) ఏకారాన్ని తరచుగా ఎక్కడ పడితే అక్కడ ఎడా పెడా వాడేయటం. నువ్వే నా ప్రాణం అనటానికీ నువ్వు నా ప్రాణం అనటానికీ తేడా ఒక్క నువ్వు మీది ఏకారమే. కానీ నువ్వే నా ప్రాణం అనడంలో నువ్వు తప్ప వేరే ఎవరూ కారు, ముమ్మాటికీ నువ్వే అన్న అర్థం దాగి ఉంది. ఇది చాలా తేలికైన అల్పమైన స్వల్పమైన భాషాసూక్ష్మంలా (language nuance) కనిపించవచ్చు. కానీ భాషలో చిన్న చిన్న సూక్ష్మాలు కూడా ముఖ్యమే. పట్టించుకోకపోతే ఎవరికీ నష్టం? మనకి కాకపోయినా కనీసం మన తరువాతి తరాల వాళ్లకైనా ఇది కచ్చితంగా నష్టమే.

వయసు నది వెల్లువై రావటమేమిటో, మధ్యలో ఆటంకాలేమిటో, దేనిని దాటుతున్నారో... ప్చ్. తర్వాత, ఓజోను చిల్లా? బిచ్చగాడి చెప్పులో చిల్లు కాదా?! స్నేహమనే ఆకాశానికి చిల్లు లేదా? అమ్మో! ఇది చాలా దారుణం, ఇంతకుమించి ఏమీ దొరకలేదా వ్రాయడానికి? ఆకాశం, ఎల్ల లేదు... ఇది మాత్రం బాగానే కుదిరింది.

నింగికిక నిచ్చెనేసుకో, చుక్కల తోటలో పువ్వులే కోసుకోలో పువ్వులే మీది ఏకారం ఏమర్థం ఇస్తోందిక్కడ? పువ్వులు మాత్రమే కోసుకో అనా? పువ్వులు కోసుకో అంటే సరిపోయేదానికి, గణాలో మాత్రలో మరొకటో సరిపెట్టటానికి ఒక పూరకంగా ఈ ఏకారాన్ని వాడుకోవటం తెలిసీ చేస్తున్న భాషాద్రోహం.

పాట - బేటా అంత్యప్రాస. పాట ఇలా వ్రాసినందుకు వ్రాసిన మహానుభావుడికి ఇదే నా నమస్కారాల బేటా, వ్యాజ్యపు తూటా. తెలుగు తల్లికి చేసే సేవలో నా వాటా. (నాకు ఒళ్లు మంట.) ఇక ఉంటా. :x

0 అభిప్రాయాలు: