Friday, June 12, 2009

పూల ఘుమఘుమ

చిత్రం: శ్రీ ఆంజనేయం (2004)
సాహిత్యం: "సిరివెన్నెల" చేంబోలు సీతారామశాస్త్రి
సంగీతం: మణిశర్మ
నేపథ్యగానం: శ్రేయా ఘోషాల్

పూల ఘుమఘుమ చేరని ఓ మూల ఉంటే ఎలా
తేనె మధురిమ చేదని ఆ మూతిముడుపేంటలా
ప్రేమంటే పామని బెదరాలా ధీమాగా తిరగర మగరాయడా
భామంటే చూడని వ్రతమేలా పంతాలే చాలుర ప్రవరాఖ్యుడా
మారనే మారవా మారమే మానవా
మౌనివా మానువా తేల్చుకో మానవా

చెలితీగకి ఆధారమై బంధమై అల్లుకో
దరికొచ్చి అరవిచ్చి అరవిందమయ్యే అందమే అందుకో
మునిపంటితో నా పెదవిపై మల్లెలే తుంచుకో
నా వాలు జడ చుట్టుకొని మొగిలిరేక నడుము నడిపించుకో
వయసులో పరవశం చూపుగా చేసుకో
సొగసులో పరిమళం శ్వాసగా తీసుకో

ప్రతిముద్దుతో ఉదయించనీ కొత్త పున్నాగనై
జతలీలలో అలసి మత్తెక్కిపోనీ నిద్రగన్నేరునై
నీ గుండెపై ఒదిగుండనీ పొగడ పూదండనై
నీ కంటి కోనేట కొలువుండిపోనీ చెలిమి చెంగలువనై
మొజులే జాజులై పోయనీ హయిని
తాపమే తుమ్మెదై తీయనీ తేనెని

* * *

౧ మారనే మారవా మారమే మానవా మౌనివా మానువా తేల్చుకో మానవా...
౨ దరికొచ్చి అరవిచ్చి అరవిందమయ్యే...
౩ మత్తెక్కిపోనీ నిద్రగన్నేరునై...
౪ మోజులే జాజులై పోయనీ హాయిని, తాపమే తుమ్మెదై తీయనీ తేనెని -- భళా. తీయని తేనెని తీయనీ :)

శబ్దార్థాలంకారాల శోభ చక్కగా చేకూరి వినడానికి హాయిగా లేవూ ఈ పై పంక్తులు? శబ్దానికి ఎంత శక్తి ఉందో, పదాల పొందిక ఎంత ముఖ్యమో కాస్త రుచి చూపించే పాటలలో ఇదొకటి. గేయపు గతి (నడక) కూడా చక్కగా ఉంది. సీతారామశాస్త్రిగారూ అందుకోండి నా జోహార్లు.

0 అభిప్రాయాలు: